తెలంగాణరాజకీయం

ఆరుగురు కొత్త మంత్రులు వీళ్లే..రేవంత్ కు షాకిచ్చిన భట్టి, ఉత్తమ్!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియరైంది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో భర్తీ చేయాల్సిన ఆరుగురు మంత్రులకు సంబంధించి హైకమాండ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సామాజీక సమీకరణాల్లో భాగంగా ఫైనల్ చేశారని సమాచారం. అయితే కేబినెట్ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి సూచించిన అన్ని పేర్లను హైకమాండ్ ఓకే చేయలేదని తెలుస్తోంది. సీఎం రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబును ఢిల్లీకి పిలిచారు ఏఐసీసీ పెద్దలు. మంత్రివర్గ కూర్పుపై ఈ ముగ్గురి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ సూచించిన పేర్లతో పాటు భట్టీ టీం చెప్పిన వారికి మంత్రిపదవులు ఓకే చేశారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం.

రేవంత్ కేబినెట్ లో ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాల నుంచి ఈసారి అవకాశం కల్పించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తీవ్రంగా ప్రయత్నించారు. వివేక్ కు రేవంత్ అండదండలు ఉండగా.. ప్రేంసాగర్ కు భట్టీ ఆశిస్సులు ఉన్నాయి. ఇక్కడ ప్రేంసాగర్ రావుపై లైన్ క్లియరైందని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపారని టాక్. సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ మొదటి నుంచి పట్టుదలగా ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. మల్ రెడ్డికి ఖచ్చితంగా వస్తుందని భావించినా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసులోకి రావడం ఆయనకు ఇబ్బందిగా మారింది.

రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి ఇద్దరూ భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు. ఈ ఇద్దరిలో ఒకరికే ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించిందట. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా కోటాలో మల్ రెడ్డికి ఓకే చెప్పారని సమాచారం.రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉత్తంకుమార్ రెడ్డి అడ్డుపుల్ల వేశారని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే తన భార్య పద్మావతికి ఇవ్వాలని ఉత్తమ్ అన్నారని టాక్. ఓకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే సమస్య వస్తుందనే భావనతో రాహుల్ కూడా రాజగోపాల్ రెడ్డి విషయంలో వద్దని చెప్పారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పరిగి ఎమ్మెల్యేకు చీఫ్ విప్ పదవి ఇస్తారని టాక్. హైదరాబాద్ జిల్లా పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దానం పార్టీలోకి వచ్చినా ఆయనను కేబినెట్ లోకి తీసుకునే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి లేరని సమాచారం.

హైదరాబాద్ జిల్లా కోటాలో ఎమ్మెల్సీ కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయనకు మంత్రిపదవిని హైకమాండ్ హామీ ఇచ్చిందని చెబుతున్నారు. ఇక బీసీ కోటాలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు ఖాయమైందని చెబుతున్నారు. ముదిరాజ్ కోటాలో నీలం మధు ముదిరాజ్ ప్రయత్నాలు చేస్తున్నా.. శ్రీహరికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే మద్దతు ఉండటంతో ఆయనకే లైన్ క్లియరైందని టాక్. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది. మొత్తంగా మంత్రివర్గ కూర్పులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి, ఉత్తమ్ సూచనలకు హైకమాండ్ ఓకే చెప్పిందని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button