తెలంగాణ

ఎల్ఆర్ఎస్ ఫీజు ఒక్క రూపాయి కూడా కట్టొద్దు..

ఎల్ఆర్ఎస్ స్కీంపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గతంలో చెప్పినట్లుగా ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేసి.. ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. పంచాయతీ సెక్రెటరీలు, బిల్ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం 15వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడమంటే ప్రజల రక్తమాంసాలను పీల్చడమే అన్నారు హరీష్ రావు. ప్రజలు ఎల్ఆర్ఎస్ ఒక్క రూపాయి కట్టొద్దని పిలుపిచ్చారు హరీష్ రావు. ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుందని చెప్పారు.

ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈ రోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో సమాధానం చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజలు దాచుకున్న సొమ్మును నిలువునా దోచుకునే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఓడ దాటే దాక ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న చందంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. నో ఎల్ఆర్ఎస్- నో బీఆర్ఎస్.. ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్‌ను అమలు చేస్తామని గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడానికి, దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా చేయడానికి కొత్త నాటకం ఆడుతున్నారని గతంలో సీతక్క అన్నదని గుర్తు చేశారు. ఎంఆర్ఎస్ తెస్తడట… తర్వాత మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీం ఎంఆర్ఎస్ కూడా తీసుకొస్తుందేమో అని రేవంత్ గతంలో సెటైర్లు వేశారని హరీష్ రావు గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిపారు.

ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్య పెట్టి రెచ్చగొట్టేలా బహిరంగ సభల్లో ఊదరగొట్టి.. ఎన్నికలు పూర్తికాగానే మాట మార్చి ఎల్ఆర్ఎస్ పైన ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు హరీష్ రావు. ఇప్పటికైనా కళ్లు తెరిచి మీరు ఇచ్చిన హామీ ప్రకారం, పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నాపు. మాట తప్పిన ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఏ ఒక్కరూ ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button