ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

చంద్రబాబుకు రేవంత్ షాక్.. మండిపడుతున్న ఏపీ ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం స్పష్టించింది. తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీగా నష్టం జరిగింది. ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోనూ వరద విలయం కనిపించింది. సూర్యాపేట జిల్లాలోనూ భారీగానే పంటలు ధ్వంసమయ్యాయి. ఇక ఏపీకి వస్తే విజయవాడ నగరం పూర్తిగా జలమలమైంది. వర్షం తగ్గి ఐదు రోజులైనా ఇంకా వందలాది కాలనీలు నీటిలోనే ఉన్నాయ. కృష్ణా, గుంటూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. వరద నష్టంపై రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి ప్రాధమిక నివేదికలు పంపాయి. తెలంగాణ సర్కార్ 5 వేల 600 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదికగా ఇవ్వగా.. ఏపీ 10 వేల కోట్లపైగా సాయం కోరుతోంది.

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఏపీ, తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నష్టం వివరాలు ఆరా తీశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రతిపాదన చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన చర్చగా మారింది. ఏపీ ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇప్పటికే వరదలపై రేవంత్ రెడ్డి చేసిన ఓ కామెంట్ చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. వరదను ముందే పసిగట్టి ప్రజలను అలర్ట్ చేయడంలో తెలంగాణ సక్సెస్ అయిందని.. ఏపీ ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లే అక్కడ నష్టం ఎక్కువ జరిగిందనే అర్ధం వచ్చేలా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రేవంత్ మాట్లాడిన ఈ బైట్ ను వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తోంది. ఈ విషయంలో రేవంత్ పై ఏపీ ప్రజలు ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు సీరియస్ గా ఉన్నారు.

తాజాగా మరోసారి చంద్రబాబును ఇరుకున పెట్టేలా వ్యవహరించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్రమంత్రికి తెలిపారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయారని, ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని సీఎం చెప్పారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.తెగిన చెర్వులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కువగా వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఏపీకి సమీపంలోనే ఉన్నాయని, అందుకే ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని అన్నారు.ఇదే ఇప్పుడు ఏపీకి ఇబ్బందిగా మారింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో భారీగా నష్టం జరిగింది. ఇలాంటి సమయంలో ఏపీకి ఎలా సాయం అందిస్తారో అలానే తెలంగాణకు కేటాయించాలని రేవంత్ ఎలా కోరుతారని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు తక్కువ ఇస్తే ఏపీని చూపించి కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button