తెలంగాణ

నల్గొండ కాంగ్రెస్‌లో ముసలం.. కోమటిరెడ్డిపై  తిరుగుబాటు?

నల్గొండ కాంగ్రెస్ లో ముసలం ముదిరిపోయినట్లు తెలుస్తోంది.  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై మెజార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సమావేశంలో బహిరంగంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేయడంతో ఇది బయటపడింది. కొంత కాలంగా లోలోపల జరుగుతున్న వర్గ పోరు.. తాజాగా మల్లన్న కామెంట్లతో రచ్చకెక్కిందని అంటున్నారు. తీన్మార్ మల్లన్న బాటలోనే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై రగిలిపోతున్నారని తెలుస్తోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తంకుమార్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదనే టాక్ కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మొదటి నుంచి కోమటిరెడ్డి మనిషిగానే ఉన్నా.. ఇప్పుడు ఆయనతో గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. బీసీ కోటాలో మంత్రి పదవి కోసం బీర్ల ప్రయత్నిస్తుండగా.. కోమటిరెడ్డి అడ్డుకుంటున్నారనే చర్చ సాగుతోంది. తన తమ్ముడికి మంత్రి పదవి కోసం బీర్లను పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీంతో కోమటిరెడ్డిపై బీర్ల ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా కోమటిరెడ్డితో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. గతంలో కోమటిరెడ్డిని తట్టుకోలేకే అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పిలుపుతో మళ్లీ సొంతగూటికి వచ్చి పోటీ చేసి గెలిచారు.

అటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామేలును కోమటిరెడ్డి టీం ఇబ్బంది పెడుతుందనే ప్రచారం సాగుతోంది. శ్యామేలుకు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనను కనీసం మంత్రి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక దందాల విషయంలో కోమటిరెడ్డి వర్గం శ్యామేలును టార్గెట్ చేసిందని అంటున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల విరేశం కూడా మంత్రితో సంబంధం లేకుండానే తన పనులు తాను చేసుకుంటున్నారని సమాచారం. వేముల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ తో యుద్దమే చేశారు. ఇప్పుడు ఓకే పార్టీలో ఉన్నా పూర్తిగా కలిసి పనిచేయడం లేదు. కోమటిరెడ్డి సొంతూరు నకిరేకల్ నియోజకవర్గంలోనే ఉండటంతో.. ఇక్కడ మంత్రి జోక్యం ఎక్కువైందని తెలుస్తోంది. తనకు తెలియకుండానే నియోజకవర్గంలో మంత్రి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వీరేశం ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. అందుకే ఇటీవల కాలంలో మంత్రి పర్యటనలో వీరేశం పెద్దగా కనిపించడం లేదు.

సీనియర్ నేత జానా రెడ్డితోనూ మంత్రి కోమటిరెడ్డికి విభేదాలు ఉన్నాయి. నల్గొండ ఎంపీగా పోటి చేసిన రఘువీర్ రెడ్డి కోసం కోమటిరెడ్డి సరిగా పని చేయలేదనే విమర్శలు వచ్చాయి. మరో మంత్రి ఉత్తం అంతా తానే వ్యవహరించారు. నల్గొండలోనూ కోమటిరెడ్డి సరిగా ప్రచారం చేయలేదనే చర్చ సాగింది. ఎంపీ ఎన్నికల సమయం నుంచే జానారెడ్డితో కోమటిరెడ్డికి గ్యాప్ వచ్చిందంటున్నారు. అందుకే ఎంపీగా గెలిచిన రఘువీర్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డితో పెద్దగా కలిసిపోవడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డికి పోటీగా నల్గొండలోనే తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు దిశగా  రఘువీర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓపెన్ గానే కోమటిరెడ్డిపై వార్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతానని శపథం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు నల్గొండ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. అయితే మల్లన్న ఆరోపణలు అంతా ఆషామాషీగా చేయలేదని.. ఆయన వెనుక కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారంటున్నారు.కొందరు పార్టీ పెద్దల మద్దతు కూడా తీన్మార్ మల్లన్నకు ఉందని తెలుస్తంది. మరోవైపు తమ నాయకుడిని ఓడిస్తానని ప్రకటించిన తీన్మార్ మల్లన్నపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు గరంగరంగా ఉన్నారు. తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్ తర్వాత తమ యాక్షన్ ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లు నల్గొండ కాంగ్రెస్ లో సెగలు రేపుతున్నాయి. ఇదీ ఎంతవరకు వెళుతుందో చూడాలి మరీ..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button