తెలంగాణ

ప్రజలు చితక్కొడతరు.. హరీష్ రావుకు సీతక్క మాస్ వార్నింగ్

హైడ్రాను కూల్చివేతలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. ప్రజలు కోరుకుంటున్న మంచి పనులను అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. జనాలే తరిమికొడతారంటూ హరీష్ రావుకు హితవు పలికారు.
చెరువులే మన భాగ్యవనరులు అని ప‌త్రిక‌ల్లో మంత్రిగా వ్యాసాలు రాసిన హ‌రీష్ రావు..హైద‌రాబాద్ లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఆవిర్బ‌వించిన హైడ్రా ను ఆడిపోసుకోవ‌డం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సీతక్క. నాడు చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై సుభాషితాలు ప‌లికి..ఇప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌డం మీకే చెల్లిందని సెటైర్లు వేశారు. చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌పై రెండు నాల్క‌ల ధోర‌ణిని విడ‌నాడాలని సూచించారు.

తొమ్మిదిన్నరేళ్లు అధికారం అనుభ‌వించిన బీఆర్ఎస్ పెద్దలు.. హైద‌రాబాద్ చెరువులు విధ్వంసానికి గుర‌వుతుంటే మౌనం వ‌హించారని సీతక్క విమర్శించారు. చెరువుల ప‌ట్ట‌ణంగా వ‌ర్దిల్లిన హైద‌రాబాద్ లోని చెరువుల‌ను చెర‌బ‌ట్టిన‌ క‌బ్జాకోరులు వాటిని చెంబులుగా మార్చిన‌ప్పుడు నిర్లక్ష్యం చూపారని చెప్పారు. మిష‌న్ కాక‌తీయ పేరుతో హ‌డావుడి చేసిన మీరు హైద‌రాబాద్ లో ఒక్క చెరువును కూడా ఎందుకు కాపాడ లేదని నిలదీశారు. వాటి స‌ర్వేను పూర్తి చేయ‌కుండా, వాటి హ‌ద్దులు గుర్తించ‌కుండా కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన మీ తీరును రాజ్యంగ బ‌ద్ద సంస్థ కాగ్ 2020 లోనే త‌ప్పుబ‌ట్టిందని గుర్తు చేశారు.

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార ప్ర‌యోజ‌నాల‌కు కొమ్ముకాసి చెరువుల సహజ మరణానికి కారణమయింది కేసీఆర్ ప్ర‌భుత్వ‌మేనని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద‌రాబాద్ స‌మ‌శితోష్ణ‌స్థితిని కాపాడే చెరువుల‌ను బ‌తికించుకోక‌పోతే..ఉక్క‌పోత, వేడి, వ‌ర‌ద‌లే హైద‌రాబాద్ కు శాపంగా మారే ప్ర‌మాదం ఉందన్నారు. ప్ర‌కృతి ఆస్థులు, ప్ర‌భుత్వ ఆస్థులు మిగిలితేనే హైద‌రాబాద్ కు భ‌విష్య‌త్తు.. ఆ స‌దుద్దేశంతో మా ప్ర‌భుత్వం హైడ్రాను ప్రారంభిస్తే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. హైద‌రాబాద్ లో చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుంబిగించిన ప్రజా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాలని..హైడ్రాను స‌మ‌ర్దించాలని.. లేక‌పోతే హైదరాబాద్ ప్ర‌జ‌ల చీత్కారాల‌కు గురి కాక‌త‌ప్ప‌దని హరీష్ రావును హెచ్చరించారు సీతక్క.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button