తెలంగాణరాజకీయం

మల్ రెడ్డి, కోమటిరెడ్డికి మంత్రి‌ పదవులు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సర్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగియడంతో మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్‌ పదవులు భర్తీ చేసే చాన్స్‌ ఉంది. ఒకట్రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తారని టాక్‌. ఆ తర్వాత పార్టీ పెద్దల అభిప్రాయం మేరకు నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశముంది. ఈసారి మంత్రి పదవులపై చాలామంది లీడర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని పార్టీ పెద్దల దగ్గరకు లాబీయింగ్‌ చేస్తున్నారు. ఈసారి కేవలం నలుగురికే మంత్రివర్గంలో చోటు దక్కబోతునట్టు తెలుస్తోంది.ష్ట్రంలో ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డితో కలిపి 12 మంత్రులు ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే మాదిగ సామాజికవర్గం నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.

ప్రస్తుతం రాష్ట్రమంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాలో అవకాశం కల్పించలేదు. ఈసారి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మూడు సార్లు గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవిపై ఆయన గంపెడాశలు పెట్టుకున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లా నుంచి సీనియర్‌ లీడర్‌ కావడం, అన్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అండదండలు ఉండటంతో మంత్రి వర్గంలో చోటు ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది. అటు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌.. ఎస్టీ కోటాలో తనకు ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇక నిజామాబాద్‌లో సీనియర్‌ లీడర్‌ సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే, మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత గడ్డం వివేక్‌ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు.. జూపల్లి కృష్ణారావు మంత్రిగా కొనసాగుతున్నారు.. అయినప్పటికీ ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే చాన్స్‌ ఉంది. ఇప్పటికే ముదిరాజ్‌ సామాజికవర్గానికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ హామీ ఇచ్చారు. దాంతో మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనతో పాటు పఠాన్ చెరుకు చెందిన నీలం మధు ముదిరాజ్‌ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. నీలం మధుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టాక్‌. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు పేరు కూడా ఆశావహుల జాబితాలో ఉంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తంగా నలుగురికే మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉండటంతో నేతలంతా తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Related Articles

Back to top button