తెలంగాణ

రుణమాఫీ పడని రైతులు ఆందోళన పడొద్దు..

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్:
తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణమాఫీ-2024లో మొదటి విడతగా లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం 11.32లక్షల రైతు కుటుంబాలకు రూ.6,014కోట్లు జమ అయినట్లు వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాలతో 17,877ఖాతాలకు చెందిన రూ.84.94కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో పడలేదన్నారు. రైతులు ఎవ్వరూ కూడా కంగారు పడొద్దని వారికి కూడా త్వరలోనే నగదు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నదాతలకు సూచించారు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం సాంకేతిక సమస్యలు సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.

వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(సీడెడ్ సంఘాలు)కు సంబంధించి మిగిలిన 15,781 రుణఖాతాల తనిఖీ సోమవారంతో పూర్తవుతుందని చెప్పారు. అనంతరం ఆ ఖాతాలకు సైతం రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Related Articles

Back to top button