తెలంగాణ

రేవంత్ మరో వరం.. రేషన్ షాపుల్లో సన్నబియ్యం 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమన్నారు ఉత్తమ్. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రాధాన్యతను వివరించారు. అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్‌ డీలర్లకు హెచ్చరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్‌షిప్‌ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విదిస్తామని అని ఆయన హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత లోపించాయని, సరిపడా బియ్యం అందడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పొంగులేటి ఆందోళనపై స్పందించిన ఉత్తమ్.. సమస్యలను పరిష్కరించి పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.బలవర్థకమైన బియ్యం నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు, మరియు లబ్ధిదారులకు నిర్ణీత పరిమాణం మరియు ఉత్తమ నాణ్యత అందేలా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను కోరారు.మహాలక్ష్మి పథకానికి సంబంధించి రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేసేందుకు పౌర సరఫరాల శాఖకు విస్తృత ప్రచారం కల్పించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారులందరికీ మెసేజ్‌లు పంపి బెలూన్లు, ఇతర ప్రచార సామాగ్రిని వినియోగించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button