తెలంగాణ

సెప్టెంబర్ 6వ కేబినెట్ విస్తరణ..రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. విదేశీ పర్యటన నుంచి రాగానే ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పెద్దలతో మాట్లాడారు. కొత్త పీసీసీ ఎంపికతో పాటు మంత్రివర్గ కూర్పుపై చర్చించారని తెలుస్తోంది. రేవంత్ కన్నా ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో హైకమాండ్ చర్చలు జరిపింది. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై ఆ ఇద్దరి నేతల అభిప్రాయాలు తీసుకుంది. రేవంత్, భట్టి, ఉత్తమ్ తో చర్చల తర్వాత మంత్రివర్గ విసరణకు కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పారని తెలుస్తోంది. కొత్తగా ఎవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశంపైనా క్లారిటీ ఇచ్చిందని సమాచారం. హైకమాండ్ లైన్ క్లియర్ కావడంతో సెప్టెంబర్ తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని టాక్. సెప్టెంబర్ 6న ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డితో కలిపి 12 మంత్రులు ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే మాదిగ సామాజికవర్గం నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గం లేరు. ఈ సారి ఆ జిల్లాల నుంచి ఖచ్చితంగా అవకాశం వస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి దక్కని పరిస్థితిలో మల్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇస్తారంటున్నారు.ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రేసులో గడ్డం బ్రదర్స్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఉన్నారు. అయితే ప్రేంసాగర్ రావుకే అవకాశం దక్కవచ్చంటున్నారు.

కేబినెట్ లో ప్రస్తుతం బీసీల నుంచి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. కొత్తగా మరొకరికి ఛాన్స్ రానుంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు అవకాశం ఉందంటున్నారు. పఠాన్ చెరుకు చెందిన నీలం మధు ముదిరాజ్‌ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. నీలం మధుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టాక్‌. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులు శ్రీహరికి ఉండటంతో ఆయన పక్కా అని సమాచారం. మైనార్టీ కోటాలో ఒకరికి మంత్రిపదవి దక్కనుంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఎమ్మెల్సీ చేసి కేబినెట్ తీసుకుంటారనే టాక్ వస్తోంది. ఇక ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం సార్ కు హైదరాబాద్ జిల్లాలో కోటాలో కేబినెట్ బెర్త్ ఇస్తారంటున్నారు. ఆయనకు విద్యాశాఖ కట్టబెడతారని సమాచారం.

Read More : కవితకు బెయిల్ ఇప్పిస్తున్న సీఎం రేవంత్ లాయర్! 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. భువనగిరి ఎంపీ సీటు గెలవడంలో కీలకంగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి గతంలో మంత్రిపదవి హామీ ఉందని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాదు ఆయనకు హోంశాఖ మంత్రి పదవి కట్టబెట్టాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారంటున్నారు.ప్రస్తుతం హోంశాఖ సీఎం దగ్గరే ఉంది. రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతకు హోంశాఖ ఇస్తే విపక్షాలను మరింత కట్టడి చేయవచ్చనే ఆలోచనలో రేవంత్ ఉన్నారని తెలుస్తోంది. తనకు హోంశాఖ వస్తుందని తన అనుచరులతో రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని కూడా తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button